మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచించారా. "ఇంత కష్టపడుతున్నాను, కానీ ఫలితం ఎందుకు రావడం లేదు?" లేదా "ఈ బాధ ఎప్పటికీ తగ్గుతుందా?" అని ఆలోచించి ఉంటా తప్పకుండా మొత్తం చదవండి. నేను కూడా అలాంటి సందర్భంలో ఎదురైంది. ఒకసారి భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. ఎదో తెలియని భయం, నాకు అర్థం అవుతుందా... భగవద్గీత చదివేంత జ్ఞానం నాలో ఉందా అనే భయంతో చదవడం ప్రారంభించాను. అర్థం అయ్యేది కాదు. చదివినదే పదే పదే చదివేవాడిని మెల్ల మెల్లగా కొంచెం కొంచెం అర్థం అర్థం అవడం ప్రారంభమైనది . అలా చదవంగా నా ఆలోచనా విధానమే మారిపోయింది.

భగవద్గీత అంటే ఏమిటి? ముందుగా అర్థం చేసుకుందాం.

భగవద్గీత అంటే కేవలం పూజారి చదివే పుస్తకం కాదు. యుద్ధభూమిలో నిలబడిన అర్జునుడికి కృష్ణుడు చూపిన మార్గము మాత్రమే కాదు. "ఇప్పుడు ఏం చేయాలి?" అనే సందర్భంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవన మార్గదర్శకం.

మీకు ఒక విషయం చెప్పాలంటే, అర్జునుడి సమస్య మనందరి సమస్యకు అద్దం పట్టినట్లు ఉంటుంది. భయం, గందరగోళం, ఏం చేయాలో తెలియని స్థితి, ప్రేమించిన వాళ్ళతో కలహం మొదలగునవన్నీ కూడా మనకూ ఉంటాయి కదా? అందుకే భగవద్గీత 5000+ సంవత్సరాలు పాటు ప్రపంచం నలుమూలల నుండి చదివించుకుంటోంది.

మొదటి మార్పు: ఫలితంపై ఉన్న భయం తగ్గుతుంది

భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం ఏమిటంటే, "కర్మ చేయి, కానీ ఫలితం ఆశించకు." అని చెపుతుంది.

చాలా మంది దీన్ని చదివి "ఇది ఎలా సాధ్యం? ఫలితం లేకుండా పని ఎందుకు చేస్తాం?" అని చాలామంది తోసిపుచ్చుతారు.

కానీ నిజంగా అర్థం చేసుకుంటే, ఇది ఒక మానసిక విముక్తి.

ఒక ఉదాహరణ చెప్పనా?

రాము అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నాడు. ప్రతి రోజూ పన్నెండు గంటలు పని చేసేవాడు. కానీ ఎందుకు ప్రమోషన్ రాలేదని బాధపడేవాడు. నిద్ర పోయేటపుడు కూడా "ఎందుకు రాలేదు, బాస్ ఏమి అనుకుంటున్నాడు" అని ఆలోచించేవాడు.

అతను స్నేహితుని బలవంతం వలన భగవద్గీత చదివిన తర్వాత ఏమన్నాడంటే, "నేను ప్రమోషన్ కోసం పని చేయడం ఆపాను. నా పనిని ప్రేమించి పని చేయడం మొదలుపెట్టాను. ఆరు నెలల్లో ప్రమోషన్ వచ్చింది. కానీ ఆ సంతోషం కంటే ముందే నేను సంతోషంగా ఉన్నాను."

ఫలితం మీద ఆందోళన తగ్గినపుడు, పనిలో నిజమైన శ్రద్ధ పెరుగుతుంది. మరియు విచిత్రంగా, ఫలితాలు కూడా మెరుగవుతాయని ఇందుకు ఉదాహరణ.

రెండవ మార్పు: కోపం తక్కువ అవుతుంది

మనలో చాలా మందికి కోపం ఒక పెద్ద సమస్య. చిన్న విషయానికి కోపం వస్తుంది. కోపంలో మాట్లాడతాం. తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది.

భగవద్గీత కోపం గురించి చాలా స్పష్టంగా చెప్తుంది. కోపం నుండి మోహం పుడుతుంది, మోహం నుండి వివేకం పోతుంది, వివేకం పోతే పతనం అవుతావు. అని దశల వారీగా వివరిస్తుంది.

ఇది చదివినపుడు మనసులో ఒక అవగాహన కలుగుతుంది. "నేను కోపంలో ఉన్నప్పుడు, నా వివేకం పనిచేయడం లేదు" అని.

ఒక చిన్న కథ చెప్పాలంటే

హైదరాబాద్‌లో ఒక టీచర్ ఉన్నారు. తరగతిలో పిల్లలు అల్లరి చేసినపుడు అరిచేవారు, కొన్నిసార్లు పిల్లలతో విసుగు చెందేవారు. ఒక విద్యార్థి అన్నాడట "మాష్టారు, మీరు కోపంలో పాఠం చెబుతే మాకు భయంగా ఉంటుంది."

ఆ మాట గుండెకు తగిలిందట. తన కోపం తగ్గించుకోవడానికి ఆలోచిస్తుండగా, ఎప్పుడూ ఆనందంగా ఉండే తన తోటి టీచర్ దగ్గరకు వెళ్లి 'ఎలా ఆనందముగా కనిపిస్తావు ఎలా? ' అని అడగగా తాను భగవద్గీత చదివుంటానని చెప్పడముతో తాను అప్పటి నుండి ఆయన భగవద్గీత చదవడం మొదలుపెట్టారు. "ఫలితం ఆశించకు" సూత్రాన్ని పాఠం చెప్పడంలో అన్వయించుకున్నారు. పిల్లలు పాసవుతారా అని కాదు, నేను బాగా చెప్పాలి అని మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టారు.

కోపం తగ్గింది. తరగతి మారింది. పిల్లలు ఆయనను ఇష్టపడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి పిల్లలు మరింత మెరుగ్గా చదవడం మొదలెట్టారు.

మూడవ మార్పు: భయం తగ్గుతుంది - ముఖ్యంగా మరణ భయం

చాలా మంది చదువుతున్న మీరు ఒక విషయం గమనించి ఉంటారు. జీవితంలో అనేక నిర్ణయాలు భయంతో తీసుకుంటాం.

"వ్యాపారం మొదలుపెడితే నష్టపోతానా?" "కొత్త పని చేస్తే తప్పు అవుతుందా?" "ప్రేమించిన వ్యక్తి వదిలి వెళ్ళిపోతే?"

భగవద్గీత చదివినపుడు ఆత్మ శాశ్వతమైనది, శరీరం మాత్రమే మారుతుంది అనే దృష్టికోణం అర్థమవుతుంది. ఇది కేవలం తాత్విక వాదన కాదు. ఇది మనసుకు ఒక లోతైన ధైర్యాన్ని ఇస్తుంది.

ఒక వ్యాపారి ఉన్నారు. కరోనా సమయంలో వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. అప్పులు పేరుకున్నాయి. ఆందోళనలో నిద్ర పోవడం కష్టంగా మారింది.

ఆయన కొడుకు భగవద్గీత చదవమని చెప్పాడు. మొదట "ఇప్పుడు పుస్తకం చదివే సమయమా?" అని కొట్టిపారేశారు. కానీ ఒక రాత్రి నిద్ర పెట్టకపోవడంతో గీత చదివారు.

ఆయన తర్వాత చెప్పారు "ఇప్పటి వరకు ఏదైతే పోయిందో అది పోయింది, కానీ నేను పోలేదు. మళ్ళీ మొదలుపెట్టగలను అని మనసులో ఒక బలం వచ్చింది."

రెండేళ్ళలో వ్యాపారం తిరిగి నిలబడింది. అప్పుడు ఆయన చెప్పేది ఏమిటంటే "వ్యాపారం కంటే ముందు నా మనసు నిలబడింది. అదే గీత ఇచ్చిన అసలైన సంపద."

నాలుగవ మార్పు: సంబంధాలు మెరుగవుతాయి

భగవద్గీతలో ఒక చోట 'ప్రతి జీవిలో నేను ఉన్నాను' అని శ్రీకృష్ణుడు చెప్తాడు ,

ఇది అర్థమైనపుడు మనముందు ఉన్న వ్యక్తి మన శత్రువు కాదు, మనలానే ఒక ఆత్మ అని మనసుకు తట్టుతుంది.

ఈ దృష్టికోణం మారడం వనాల పోట్లాటలు తగ్గుతాయి, మాట్లాడే తీరు మారుతుంది, వినే నైపుణ్యం పెరుగుతుంది.

తెలిసిన ఒక జంట ఉంది. పది సంవత్సరాల వివాహం తర్వాత కూడా ఎప్పుడూ తిట్టుకునే పరిస్థితి ఉంది. ఒక ఆధ్యాత్మిక కౌన్సెలర్ సూచన మేరకు ఇద్దరూ కలిసి భగవద్గీత చదవడం మొదలుపెట్టారు.

ఒక మాసాలు గడిచిన తర్వాత వారు చెప్పారు "మేము గీతలో ఒక వాక్యం చదివాం అది ఏమిటంటే 'నీవు నీది అనుకున్నది ఏదీ నీది కాదు, ఏదీ నీవు తీసుకు రాలేదు, ఏదీ నీవు తీసుకు వెళ్ళవు. అది చదివాక ఒకరి తప్పులు ఒకరు పట్టుకోవడం ఎందుకు అని అర్థమైంది. అప్పటి నుండి సంసారం వేరేగా మారింది."

ఐదవ మార్పు: నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది

జీవితంలో అతి పెద్ద కష్టం ఏమిటంటే రెండు మంచి ఎంపికల మధ్య ఏది తీసుకోవాలో అర్థం కాకపోవడం.

ఉద్యోగం మానాలా వద్దా? ఊరు వదిలి వెళ్ళాలా వద్దా? సంప్రదాయం పాటించాలా లేదా ఆధునికత పాటించాలా?

భగవద్గీత ఒక స్పష్టమైన సూత్రం చెప్తుంది. స్వధర్మాన్ని అనుసరించు. అంటే నీ గుణానికి, నీ స్వభావానికి, నీ పరిస్థితికి తగ్గట్టు నడుచుకో అని.

ఇది చదివినపుడు బయటి వ్యక్తులు ఏమనుకుంటారు అనే ఆలోచన తగ్గుతుంది. "నాకు ఏది సరి?" అనే ప్రశ్న మొదలవుతుంది. నిర్ణయాలు బయటి ఒత్తిడి నుండి కాకుండా మన లోపలి నుండి వస్తాయి,

ఒక యువతి ఉంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆమె కుటుంబం ఉద్యోగం చేయమంటే, మనసు పెయింటింగ్ నేర్పించమంటోంది. ఏ వైపు వెళ్ళాలో తెలియలేదు.

ఆమె భగవద్గీత చదివింది. "నీ స్వభావం నుండి పుట్టిన పని నిన్ను అలసిపోనివ్వదు" అనే సూత్రం ఆమెను ఒక స్పష్టతకు తీసుకొచ్చింది.

ఇప్పుడు ఆమె ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతోంది. అది చిన్నగా ఉన్నా, మనసుకు నిండుగా ఉందని ఎంతో ఆనందంగా ఉందని చెప్తుంది.

ఆరవ మార్పు: ఒంటరితనం తగ్గుతుంది

ఈ కాలములో కొందరికి అందరిలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్లు అనిపింస్తుంది. ఈ భాద చాలా మంది అనుభవిస్తున్నారు.

భగవద్గీత ఒక విషయం చెప్తుంది. నువ్వు ఒంటరివి కాదు, నీలో ఉన్న ఆత్మ అనంతమైన మూలంతో అనుసంధానమై ఉంది అని.

ఇది మత వాదన కాదు. ఇది ఒక లోతైన మానసిక సత్యం. తన లోపల ఒక స్థిరత్వాన్ని కనుగొన్న వ్యక్తికి బయటి ఒంటరితనం అంత బాధగా అనిపించదు.

ఒక కాలేజీ విద్యార్థి చెప్పింది. "నాకు స్నేహితులు ఉన్నారు, కానీ లోపల ఏదో తెలియని శూన్యం ఉండేది. గీత చదివిన తర్వాత ఆ శూన్యం నింపడానికి బయటి వ్యక్తులు అవసరం లేదని తెలిసింది. అది నేనే నింపుకోగలను అని అర్థమైంది."

ఏడవ మార్పు: నిద్ర మరియు మానసిక ప్రశాంతత

ఇది చాలా మంది చెప్పే అనుభవం భగవద్గీత చదివిన తర్వాత నిద్ర మెరుగైంది అని.

దీనికి కారణం ఏమిటంటే, రాత్రి పడుకునేముందు మనసులో ఎన్ని ఆలోచనలు తిరుగుతాయో, వాటిలో చాలా భాగం "రేపు ఏమవుతుందో" అనే ఆందోళన. అయితే భగవద్గీత చదివినపుడు ఆ ఆందోళన నెమ్మదిగా తగ్గుతుంది.

ఇది ఆధ్యాత్మిక కారణమే కాదు, శాస్త్రీయంగా కూడా అర్థమవుతుంది. మైండ్‌ఫుల్‌నెస్ సాధన ఒత్తిడిని తగ్గిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. భగవద్గీత చదవడం ఒక రకమైన మైండ్‌ఫుల్‌నెస్ అభ్యాసమే.

భగవద్గీత చదవడం ఎలా మొదలుపెట్టాలి?

చాలా మందిని కలిసినపుడు భగవద్గీత చదువుతున్నారా.. చదవకుంటే చదవచ్చు కదా అని చెపితే
"సంస్కృతం తెలియదండీ, అర్థం కాదు ?" అంటుంటారు.

దానికి మా నుంచి వచ్చే సమాధానం చాలా స్పష్టం ఉంటుంది.
సంస్కృతం తెలియాల్సిన అవసరం లేదండీ. తెలుగు అనువాదం చాలా బాగుంటుంది. మన భాషలో చదివితే మనసుకు నేరుగా తాకుతుంది.

మొదలుపెట్టడానికి కొన్ని చిట్కాలు:

రోజూ 15 నిముషాలు చాలు. ప్రతి రోజు మొత్తం చదవాలని పట్టుపట్టకండి. ఒక్క శ్లోకం చదివి, ఒక పది నిముషాలు ఆ అర్థం గురించి ఆలోచించడమే అసలైన చదువు.

భగవద్గీత లో 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి రోజుకు ఒక్క శ్లోకం చదివినా రెండు సంవత్సరాలలో భగవద్గీత మొత్తం చదవడం అయిపోతుంది.
చదివే కొద్దీ మీలో మార్పును మీరే గమనిస్తారు.

చివరగా - ఒక ముఖ్యమైన మాట

భగవద్గీత చదివిన తర్వాత మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోదు. ఇది ఒక ప్రక్రియ.

మొదటి నెలలో చిరాకు తగ్గుతుంది. రెండవ నెలకు ఆందోళన నెమ్మదిస్తుంది. ఆరు నెలల తర్వాత "నేను మారాను" అని మీరు చెప్పరు, అంతే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీలోని మార్పును గమనిస్తారు.

భగవద్గీత ఒక మాయా మంత్రం కాదు. మిమ్మల్ని మీరు స్పష్టంగా చూసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్దం లాంటిది.

ఆ స్పష్టత ఒక్కసారి వచ్చిన తర్వాత జీవితం మారక ఏమవుతుంది?

మీ అనుభవం ఏమిటి? భగవద్గీత చదివారా? మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ అనుభవం మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, అది ఈ పేజీలో పదిమందికి తెలియజేయడంతో మరొకరికి ప్రేరణ అవుతుంది.

మనిషిని చక్కదిద్దే భగవద్గీత చదవకుంటే ఈరోజు చదవడం ప్రారంభించండి.

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

ఇట్లు,
శ్రీ రామ సేవా సమితి
+91 630 176 7565